చెత్త నిల్వ కేంద్రాన్ని తరలించాలి.. వందలాది కుటుంబాల ఆరోగ్యానికి ముప్పు.
బీసీ పీపుల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్.
హైదరాబాద్ నవంబర్ 2 స్థానికం ప్రతినిధి:
ఆటోనగర్‌లో చెత్త నిల్వతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఆటోనగర్‌లో చెత్త నిల్వ కేంద్రం కారణంగా వందలాది కుటుంబాల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
చెత్త నుంచి వెలువడుతున్న దుర్వాసన, దుమ్ము, పొగతో పాటు భారీ వాహనాల రాకపోకలు, శబ్ద కాలుష్యంతో స్థానికులు నిత్యం అవస్థలు పడుతున్నారని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి భారీ వాహనాల్లో చెత్తను తీసుకొచ్చి ఆటోనగర్‌లో నిల్వ చేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టాలని కోరారు.రాంకీ సంస్థకు సంబంధించిన ఒప్పందాలు, చెత్త నిల్వకు ఇచ్చిన అనుమతులు, వ్యర్థాల తరలింపు వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని చెత్త నిల్వ కేంద్రాన్ని తక్షణమే తరలించడంతోపాటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు స్థానిక ప్రజల పక్షాన బీసీ పీపుల్స్ ఫెడరేషన్ పోరాటం కొనసాగిస్తుందని బొంగు వెంకటేష్ గౌడ్ స్పష్టం చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి