పదునైన కత్తితో బెదిరించినట్లు ఆరోపణ.. పోలీసులకు ఫిర్యాదు
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి: మండల పరిధిలోని నేలపట్ల ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులపై వార్డెన్ దాడికి పాల్పడటంతో పాటు పదునైన కత్తితో బెదిరించినట్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపించారు.ఈ ఘటనపై సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.బాధితులు, సామాజిక కార్యకర్త తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 29న హాస్టల్ తనిఖీకి కమిషనర్ వస్తున్నారనే కారణంతో విద్యార్థులను పాఠశాలకు పంపకుండా వసతి గృహంలోనే ఉంచారు. అయితే బడిలో హాజరు నమోదు చేసుకోవాల్సి ఉండటంతో 5వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన వార్డెన్ విద్యార్థులపై బకెట్‌తో దాడి చేసి, కత్తితో బెదిరించినట్లు చిన్నారులు తమ తల్లిదండ్రులకు తెలిపారు.విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై విషయం చెప్పడంతో, తల్లిదండ్రులు సమాచార హక్కు రక్షణ చట్టం-2005 జిల్లా అధ్యక్షుడు దబ్బటి శేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన హాస్టల్‌కు వెళ్లి ప్రశ్నించగా వార్డెన్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని పేర్కొన్నారు. దీంతో బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి చౌటుప్పల్ పోలీసులకు, బాలల సంరక్షణ అధికారులకు ఫిర్యాదు చేశారు. చైల్డ్ వెల్ఫేర్ అధికారుల తనిఖీ
సమాచారం అందుకున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా దబ్బటి శేఖర్ మాట్లాడుతూ.. ఘటనపై తక్షణమే విచారణ జరిపి, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు బుట్టి సత్యం, షేక్ గౌస్, పాలమాకుల రమేష్, కోడం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి