పోలీసు క్రీడలకు హైదరాబాద్ వేదిక..! 23 నుంచి అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్ ఛాంపియన్‌షిప్
పోలీసు క్రీడలకు హైదరాబాద్ వేదిక..! 23 నుంచి అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్ ఛాంపియన్‌షిప్
Editor Desk
36 బలగాల నుంచి 1,600 మందికి పైగా క్రీడాకారులు.. ఐదు విభాగాల్లో పోటీలు
హైదరాబాద్, జులై 20: దేశవ్యాప్తంగా పోలీసు, కేంద్ర సాయుధ బలగాల క్రీడాకారుల ప్రతిభకు వేదికగా నిలిచే 11వ అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్ ఛాంపియన్‌షిప్–2026కు హైదరాబాద్ సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి 30 వరకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించనున్నారు.
దేశంలోని 36 రాష్ట్ర పోలీసు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల నుంచి 1,600 మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్న ఈ మెగా క్రీడోత్సవంలో జూడో, వుషు, తైక్వాండో, కరాటే, పెన్‌కాక్ సిలాట్ విభాగాల్లో హోరాహోరీ పోటీలు జరగనున్నాయి. జాతీయ క్రీడా సమాఖ్యలకు చెందిన 150 మంది సాంకేతిక అధికారులు పోటీల నిర్వహణను పర్యవేక్షించనున్నారు.
ఈ పోటీలకు సంబంధించిన వివరాలను సోమవారం నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (నీసా)లో నిర్వహించిన మీడియా సమావేశంలో నీసా డైరెక్టర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ హర్‌ప్రీత్ కౌర్ సోహి వెల్లడించారు. పోలీసు బలగాల్లో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఈ ఛాంపియన్‌షిప్ దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు.
పారుపల్లి కశ్యప్, ప్రముఖ రోయింగ్ కోచ్ ఇస్మాయిల్ బేగ్ మాట్లాడుతూ.. ఇలాంటి జాతీయ స్థాయి పోటీలు క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దడంలో కీలకమని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర జంతువు మచ్చల జింక (చీతల్) ఆధారంగా రూపొందించిన ‘వీరా’ మస్కట్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఆసియా క్రీడలకు ముందు నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్‌షిప్ క్రీడాకారులకు విలువైన పోటీ అనుభవాన్ని అందించనుంది. పోటీల నిర్వహణకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ, తెలంగాణ పోలీసు అకాడమీతో పాటు పలు సంస్థలు సహకరిస్తుండగా, నాడా (NADA) ఆధ్వర్యంలో డోపింగ్ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి