యాచారం, అక్టోబర్ 22: బహుజన వీరుడు, పాలమూరు ముద్దుబిడ్డ, తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న 174వ జయంతి ఉత్సవాలకు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఉదయం 8:30 గంటలకు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై హర్షం
పండుగ సాయన్న జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడంపై మొండిగౌరెల్లి ముదిరాజ్ సంఘం సభ్యులు, బహుజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సాయన్న జయంతికి అధికారిక గుర్తింపు కల్పించినందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పెద్ద సంఖ్యలో పాల్గొనాలి
గ్రామంలోని ముదిరాజ్ సంఘం ప్రాంగణంలో నిర్వహించనున్న ఈ వేడుకలకు సాయన్న అభిమానులు, యువజన, మహిళా, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు పిలుపునిచ్చారు. కులబాంధవులు, గ్రామస్తులు స్వచ్ఛందంగా తరలివచ్చి పండుగ సాయన్నకు ఘన నివాళులర్పించాలని మొండిగౌరెల్లి ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి