13వ వార్డు సమగ్రాభివృద్ధికి కృషి: మున్సిపల్ ఛైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
పట్టణంలోని 13వ వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చౌటుప్పల్ పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా బుధవారం 13వ వార్డులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పాత బజారు ప్రాంతంతో పాటు బస్తీగా ఉన్న ఈ వార్డులో పూర్తిస్థాయిలో శానిటేషన్ పనులను నిర్వహించారు.
పనుల్లో భాగంగా రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, కంపచెట్లను జేసీబీ సహాయంతో తొలగించారు. రహదారులపై పేరుకుపోయిన మట్టి కుప్పలను డోజర్‌తో చదును చేయించగా, పారిశుద్ధ్య కార్మికులు మురుగు కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రం చేశారు.ఈ పనులను స్వయంగా పర్యవేక్షించిన ఛైర్‌పర్సన్.. స్థానిక కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్‌తో కలిసి వార్డులో నెలకొన్న పలు సమస్యలను పరిశీలించారు. వాటి పరిష్కారానికి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 13వ వార్డులో శాశ్వత మురుగు కాలువల (డ్రైనేజీల) నిర్మాణానికి ఇప్పటికే అంచనా పనులు ప్రారంభమయ్యాయని, మరికొద్ది నెలల్లోనే పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజినీర్ రేణుకుమార్, వార్డు అధికారి కుమార్, బిల్ కలెక్టర్ బుచ్చి రాములు, వర్క్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్, జవాన్లు అంజయ్య, నరసింహ, వాటర్ మెన్లు, ఎలక్ట్రీషియన్, పారిశుద్ధ్య కార్మికులు, కాలనీ నాయకులు చెవగొని వెంకటేశం, వర్కాల వెంకట్ కుమార్, తొర్పునూరి రవి, గుయ్యని జంగయ్య, మార్గం స్వామి, మార్గం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి