సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమన్యాయం అందించడంతో పాటు, సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు రాజ్యాంగం రూపొందించిన న్యాయ చట్టాలు ఎంతగానో దోహదపడతాయని నారాయణఖేడ్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎం. హిమబిందు అన్నారు. సోమవారం నారాయణఖేడ్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన న్యాయ సాధికారత సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చిన్నతనం నుంచే రాజ్యాంగం, న్యాయ చట్టాలు, పౌరుల హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. సమాజంలో వస్తున్న నూతన చట్టాల గురించి తెలుసుకుంటూ తమ హక్కులను కాపాడుకోవడంతో పాటు, ఇతరుల హక్కులను కూడా గౌరవించాలని తెలిపారు.ముఖ్యంగా మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలపై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి అన్యాయం జరిగినా భయపడకుండా చట్టపరమైన సహాయం పొందాలని సూచించారు. ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు వాటిని ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల మాటలకు, అనవసరమైన ప్రలోభాలకు లొంగకూడదని హితవు పలికారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా, వ్యక్తిగత వివరాలను అపరిచితులకు తెలియజేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులతో న్యాయ పరిరక్షణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మారుతీ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు పంపించే ఏపీకే ఫైళ్లను తెరవకూడదని, వాటి ద్వారా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా ఉపయోగిస్తూ సైబర్ నేరాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవిస్తూ, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివి జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యతో పాటు నైతిక విలువలు, సమాజంపై అవగాహన, చట్టాల పట్ల గౌరవం కలిగి ఉండటం ప్రతి విద్యార్థికి అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది భోజి రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మన్మధ కిషోర్, ఉపాధ్యాయులు యాదగిరి, చంద్రశేఖర్, రాజయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థులు సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి – మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎం. హిమబిందు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి