నీళ్లు, విద్యుత్ అందక చేతికొచ్చే సమయంలో పంట నష్టం
నాలుగెకరాలు కౌలుకు తీసుకుంటే.. మూడెకరాల్లో ఎండిన పంట
కౌలు ఎలా కట్టాలి.. పెట్టుబడి ఎలా తీర్చాలి అంటూ రైతు కుటుంబం ఆవేదన
ఆత్మకూర్ (ఎస్):
కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు, విద్యుత్ సరిగా అందక ఎండిపోవడంతో ఓ కౌలు రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పంట నష్టాన్ని తట్టుకోలేక తన పొలంలో ఎండిపోయిన పంటకు నిప్పంటించాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
మండల కేంద్రానికి చెందిన రైతు యాతాకుల మల్లయ్య నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు, విద్యుత్ సరిపడా అందకపోవడంతో మూడు ఎకరాల్లో పంట ఎండిపోయింది. దీంతో తీవ్రంగా నష్టపోయిన రైతు ఆవేదనతో ఎండిన పంటకు నిప్పంటించాడు.
కౌలు ఎలా కట్టాలి.. పెట్టుబడి ఎలా తీర్చాలి?
పంట సాగు కోసం చేసిన అప్పులు, పెట్టిన పెట్టుబడి, చెల్లించాల్సిన కౌలు గుర్తుకొస్తుండటంతో రైతు కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. పంట చేతికందకపోవడంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, అప్పులు ఎలా తీర్చాలి, కౌలు ఎలా చెల్లించాలంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఆరుగాలం శ్రమించి పంటను సాగు చేసినప్పటికీ కీలక సమయంలో నీరు, విద్యుత్ అందక నష్టం వాటిల్లడంతో రైతు కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకొని పంట నష్టానికి పరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి