ప్లకార్డులతో ఎన్‌పీఆర్‌డీ నిరసన
భువనగిరి, అక్టోబర్ 17: అర్హులైన పేదల ఓట్లను తొలగిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం భువనగిరి పట్టణంలోని వినాయక చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టింది.
ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు సుర్పంగా ప్రకాష్, ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ.. ఓట్ల తొలగింపు చర్యలతో అర్హులైన పేదలు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, పేదలు, అణగారిన వర్గాలు, వికలాంగుల ఓటు హక్కును పరిరక్షించాలని కోరారు. అర్హుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించకుండా పారదర్శక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లపల్లి స్వామి, కోశాధికారి కొత్త లలిత, నాయకులు పండాల శ్రీహరి, టీ. మధు, వల్లాల రాధాకృష్ణ, కందుల కృష్ణమూర్తి, ఎస్‌కే నశీనా బేగం, ఎస్‌కే రషీద్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి