మహిళల ఆత్మగౌరవానికి,ప్రజాస్వామ్య బలోపేతానికి ఇది గొప్ప అవకాశం: మాధురి చంద్ర
యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి చంద్ర మాట్లాడుతూ..మహిళా సాధికారత అనేది కేవలం ఒక నినాదం కాదని, సమాజ అభివృద్ధికి అది పునాది అని అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచన మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంపొందించడంతో పాటు, సమాన అవకాశాల దిశగా ఒక కీలకమైన ముందడుగు అని పేర్కొన్నారు. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్న శుభ సందర్భంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా మహిళా రిజర్వేషన్‌కు మద్దతు తెలుపుతున్న అన్ని రాజకీయ పార్టీలకు,పార్లమెంటు సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.మహిళల రాజకీయ సాధికారత కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. అదేవిధంగా డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) కూడా అభివృద్ధి వికేంద్రీకరణకు దోహదపడే ముఖ్యమైన నిర్ణయమని మాధురి చంద్ర అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ప్రజలకు పాలన మరింత చేరువ కావడంతో పాటు,స్థానిక సమస్యలపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.చిన్న నియోజకవర్గాల ద్వారా మారుమూల ప్రాంతాలు,అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు సమర్థవంతంగా చేరే అవకాశం ఉందని అన్నారు.మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకుండా దేశ నిర్మాణంలోనూ,పాలనలోనూ,నిర్ణయాధికారంలోనూ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మహిళలకు సరైన అవకాశాలు కల్పిస్తే వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడమే కాకుండా, సమాజానికి కొత్త దిశను చూపగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా మహిళల హక్కులు, ఆత్మగౌరవం, సమానత్వం,భవిష్యత్ తరాల అభివృద్ధి కోణంలో చూడాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా,పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం పొందడం ప్రజాస్వామ్యానికి గర్వకారణమని అన్నారు. మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం అనేది ఎవరికో రాజకీయ విజయం కాదు.. మహిళల ఆత్మగౌరవానికి,సమాన హక్కులకు,ప్రజాస్వామ్య బలోపేతానికి లభించిన గొప్ప అవకాశం అని మాధురి చంద్ర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు బండారి స్వర్ణలత,బూర్గు రాణి, మున్సిపల్ కౌన్సిలర్ తుమ్మల యాస్మిన్ నగేష్,జిల్లా ఉపాధ్యక్షురాలు కుమ్మరిండ్ల లక్ష్మి, జిల్లా కార్యదర్శి సీత మానస,పట్టణ అధ్యక్షురాలు ఎంగి ప్రేమలత,కార్యవర్గ సభ్యురాలు మేకల గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టు -జి.శ్రీనివాస్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి