బడ్జెట్‌లో రూ.250 కోట్ల ప్రత్యేక నిధి కేటాయించాలి: డాక్టర్ చిలకల శ్రీనివాస్ యాదవ్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని పాలకులు విస్మరించారని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి (ఉమ్మడి ఖమ్మం–వరంగల్–నల్గొండ), బీసీవై పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు డాక్టర్ చిలకల శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సొంత ఖర్చులతో వార్తలు సేకరిస్తూ, కనీస వేతనాలు లేక విలేకరుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.జర్నలిస్టుల సమగ్ర అభివృద్ధి కోసం బడ్జెట్‌లో తక్షణమే రూ.250 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు లేదా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, పరిమితులు లేని నగదు రహిత (క్యాష్‌లెస్) ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు. సీనియర్ జర్నలిస్టులకు నెలకు రూ.25 వేల గౌరవ పెన్షన్, విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు.ప్రధాన మీడియాతో పాటు డిజిటల్, వెబ్ పోర్టల్స్, చిన్న పత్రికలు, గ్రామీణ విలేకరులందరికీ గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు, ఆర్టీసీ పాసులు అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి