అమ్మ చావుకి రాని కొడుకుని తరిమికొట్టిన ఊరు
ఊరి బయటే ఆపి కారు నుండి లాగి కుటుంబ సభ్యులకు బుద్ది చెప్పిన గ్రామస్తులు
పారిపోయిన కొడుకు ఉప్పలయ్య
జనగాం జిల్లా తరిగొప్పుల గ్రామంలో శనివారం కన్నీళ్లు కాస్తా ఆగ్రహంగా మారాయి.
కీర్తిశేషులు నాగ బండి రామచంద్రం భార్య పుష్పనీల చనిపోయినప్పుడు, కడసారి చూడ్డానికి కూడా రాని ఆమె కొడుకు, శనివారం గ్రామానికి రాగానే గ్రామస్తులు తరిమికొట్టారు.
పుష్పనీల అంటే ఈ ఊరికి తల్లి. అందరి ఆకలి తీర్చిన అమ్మ. అందరి బాధలో తోడు నిలిచిన అమ్మ. అలాంటి అమ్మ చనిపోతే, తలకొరివి పెట్టాల్సిన కొడుకు రాలేదు. కన్న బిడ్డలు ఎవరూ పక్కన లేరు.
అప్పుడు ఊరే కొడుకు అయింది. ఊరే కూతురు అయింది. "మేమంతా ఆమె బిడ్డలమే" అని శవాన్ని భుజాలపై మోసి, ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు.
అంతా అయిపోయాక ఇన్ని రోజులకు కొడుకు ఊర్లోకి కుటుంబ సభ్యులతో వచ్చాడు. అది చూసిన గ్రామస్తులకు రక్తం మరిగిపోయింది.
అమ్మ బతికున్నప్పుడు ఎక్కడున్నావ్? చనిపోయినప్పుడు ఎక్కడున్నావ్? ఇప్పుడు ఎందుకొచ్చావ్? ఆస్తి కోసమా?" అంటూ మహిళలు, యువకులు నిలదీశారు.
పెద్దలు సర్ది చెప్పబోయినా ఎవరూ వినలేదు. తల్లి అవసరం లేని కొడుకుకు ఊరు కూడా అవసరం లేదు అంటూ కారును ఊరి బయటే ఆపి కారు నుండి కుటుంబ సభ్యులను బయటకు లాగి పిడిగుద్దులు గుద్ది బుద్ది చెప్పారు, గ్రామం నుంచి బయటకు పంపించేశారు.
కొడుకు ఉప్పలయ్య ఏమీ మాట్లాడలేక, తల దించుకుని వెనుదిరిగి వెళ్లిపోయాడు.
ఊరి మాటగా ఒకటే మాట
పుష్పనీలమ్మ మాకు అమ్మ. ఆమెను ఒంటరిగా వదిలేసిన వాడిని మేము క్షమించలేం. రక్తం కంటే గొప్పది మానవత్వం అని ఈ ఊరు మళ్లీ నిరూపించింది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి