భువనగిరి రూరల్, అక్టోబర్ 5: భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి పరిధిలోని రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ గ్రంథావిష్కరణ మహోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. జగద్గురు శ్రీ రమణానంద మహర్షి సంస్కృతంలో రచించిన ఈ గ్రంథాన్ని పలువురు జగద్గురువులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతుల సమక్షంలో ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఆధ్యాత్మిక ప్రముఖులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బంగారు శివలింగానికి అభిషేకం నిర్వహించిన అనంతరం జ్యోతిర్మండల ఆలయంలోని నక్షత్ర, నవగ్రహ, రాశ్యాత్మక దేవతలను దర్శించుకున్నారు. అనంతరం శ్రీ రమణానంద మహర్షి ఆధ్యాత్మిక ప్రముఖులను సత్కరించారు.
అధ్యయనం చేయదగిన గ్రంథం
సనాతన ధర్మ తత్త్వాన్ని 1008 సంస్కృత సూత్రాల రూపంలో అందించిన ఈ గ్రంథం విశిష్ట మార్గదర్శకమని జగద్గురువులు పేర్కొన్నారు. ప్రతి హిందువూ అధ్యయనం చేయదగిన గ్రంథమని ప్రశంసించారు. సనాతన ధర్మం అనాదిగా కొనసాగుతున్న ధర్మమని, ఆత్మలోని దైవాన్ని దర్శించడమే దాని సారమని వివరించారు. ఆత్మజ్ఞానం, అంతర్ముఖ సాధన, దైవానుభూతి ద్వారా ధర్మాన్ని జీవితంలో అనుభవించాలని సూచించారు.
కార్యక్రమంలో స్వామి అవధేశ్ ప్రపన్నాచార్య, యోగేశ్వర్ ఆనంద్‌జీ మహారాజ్, స్వామి నరేంద్రనాథ్ సరస్వతీజీ మహారాజ్, విమల్ దేవ్ ఆశ్రమ్‌జీ మహారాజ్, మహామండలేశ్వర్లు రాజేందర్ గిరి స్వామి, రాజేశ్వర్ దాస్‌జీ మహారాజ్, కామేశ్వర్ పురిజీ, స్వామి హర్షానంద తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి