నల్లగొండ: రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు. నవంబర్ 15 నుంచి 20 వరకు నల్లగొండలో నిర్వహించనున్న మహాసభల ప్రచారంలో భాగంగా అనంతారం గ్రామంలో సోమవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల మోటార్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని అన్నారు.
వ్యవసాయ సీజన్‌లో విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ అవసరాలకు సరిపడా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు విద్యుత్, సాగునీరు, పంటలకు గిట్టుబాటు ధర వంటి అంశాల్లో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
నల్లగొండ ఎన్జీ కాలేజీలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రైతులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతాంగ సమస్యలను జాతీయ స్థాయిలో చర్చించి, వాటి పరిష్కారానికి కృషి చేసే మహాసభల్లో రైతులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని కోరారు.
కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, కొండ వెంకన్న, మానుపాటి ఎల్లయ్య, గ్రామ కార్యదర్శి రాములు, అంజయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. మహాసభలు, బహిరంగ సభ విజయవంతానికి గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి