కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు..
- హామీల అమలులో విఫలమయ్యాయని ధ్వజం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లమాస శ్రీకాంత్ గౌడ్
భువనగిరి టౌన్:ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నించే గొంతుకను పట్టభద్రులు తమ ఓటుతో ఎన్నుకోవాలని నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నల్లమాస శ్రీకాంత్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్,ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించడంలో విఫలమైందని,ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. శుక్రవారం భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల పక్షాన నిలబడని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాయని ప్రశ్నించారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటనలపై స్పందించకుండా,సంధ్య థియేటర్ ఘటన సమయంలో సినిమా చూస్తూ సందడి చేయడానికే బీఆర్ఎస్ నేతలు ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో ఇళ్లు కోల్పోయిన బాధితుల సమస్యలతో పాటు కృష్ణా-గోదావరి జలాల వివాదం, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు వంటి అంశాలపై తెలంగాణ రక్షణ సేన పార్టీ పోరాటం చేస్తూ పరిష్కార దిశగా కృషి చేసిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తమ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్రోత్తం రెడ్డి ప్రజల సమస్యలపై అవగాహన లేని వ్యక్తి అని విమర్శిస్తూ,ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు.ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ ఏర్పాటు, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతుండటం,విద్యావ్యవస్థ వ్యాపార ధోరణిలోకి వెళ్లడంతో పేద,మధ్యతరగతి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని జైలు జీవితం గడిపానని,సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చి కులవృత్తిపై ఆధారపడిన కుటుంబ నేపథ్యం కలిగిన తనకు పట్టభద్రులు అవకాశం కల్పించాలని కోరారు. ప్రజా సమస్యలపై పూర్తి అవగాహనతో,నిరంతరం అందుబాటులో ఉంటూ వారి గొంతుకగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సుజిత్ రావు,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి సయ్యద్ ఇస్మాయిల్,నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ జర్నలిస్టు -జి.శ్రీనివాస్.✍️
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి