ఘనంగా ‘ఆరంభ్–2026’ వేడుకలు
అకడమిక్ హైట్స్ స్కూల్‌లో విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు
ప్రత్యేక ఆకర్షణగా గ్రాండ్ పేరెంట్స్ డే
భువనగిరి, నవంబర్ 21: స్థానికం ప్రతినిధి
భువనగిరి పట్టణంలోని జగదేవ్‌పూర్ రోడ్డులో ఉన్న అకడమిక్ హైట్స్ స్కూల్‌లో ‘ఆరంభ్–2026’ వార్షిక విద్యా, సాంస్కృతిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. బచ్పన్ స్కూల్, అకడమిక్ హైట్స్ స్కూల్ చైర్‌పర్సన్ తీగల జయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను వివిధ రూపాల్లో ప్రదర్శించారు.
వేడుకల్లో భాగంగా విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులు, వర్కింగ్ మోడల్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, హ్యాండ్‌మేడ్ ఉత్పత్తులు, వ్యాపార ఆలోచనలు, భాషా సాహిత్య ప్రదర్శనలు, సంప్రదాయ కళలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తమ ప్రాజెక్టుల పనితీరును వివరిస్తూ శాస్త్రీయ ఆలోచనలు, సృజనాత్మకతను చాటుకున్నారు. చిన్నారుల వినూత్న నమూనాలు, కళాత్మక ప్రదర్శనలను తల్లిదండ్రులు అభినందించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలను ప్రత్యేకంగా ఆహ్వానించి శాలువాలతో సత్కరించారు. పెద్దల పట్ల గౌరవం, కుటుంబ విలువలు, తరతరాల అనుబంధాలను తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహించారు.
విద్యార్థుల్లో పుస్తక జ్ఞానంతోపాటు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం పేర్కొంది. విద్యతోపాటు సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలకు ప్రాధాన్యతనివ్వడం ఈ వేడుక ముఖ్య ఉద్దేశమని తెలిపింది.
కార్యక్రమానికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రియాంక, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి