నల్గొండలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంబీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలుకృష్ణా జలాల పరిరక్షణ కోసం కవిత నాయకత్వంలో భారీ ప్రజా ఉద్యమానికి పిలుపు
నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే శాసనమండలిలో నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా నిలుస్తానని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని శాలిని రెసిడెన్సీలో శనివారం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లపై ఆయన ఏకకాలంలో రాజకీయ అస్త్రాలు సంధించారు.
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం: గత పాలకులు, ప్రస్తుత ప్రభుత్వాలు నిరుద్యోగ యువతను మోసం చేశాయని శ్రీకాంత్ గౌడ్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలతో విద్యార్థుల పదేళ్ల కష్టం, తల్లిదండ్రుల ఆశలు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేటీఆర్ ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచడం ద్వారా నిరుద్యోగ యువత అవకాశాలను దెబ్బతీశారని విమర్శించారు.ప్రవళిక ఆత్మహత్య, ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణాలకు గత పాలకుల వైఖరే కారణమని ఆరోపించారు.
మరోవైపు, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. జాతీయ స్థాయిలో నీట్ (NEET), యూజీసీ నెట్ (UGC NET) పేపర్ లీకేజీలపై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ హామీల అమలుపై ప్రశ్నలు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల వయసు పెరుగుతోంది తప్ప, ఉద్యోగాలు మాత్రం రావడం లేదని శ్రీకాంత్ గౌడ్ విమర్శించారు. మెగా డీఎస్సీ, పోలీసు నియామకాలపై ప్రభుత్వం నిరుద్యోగులకు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 'యూత్ డిక్లరేషన్' హామీలైన విద్యార్థినులకు స్కూటీలు, విదేశీ విద్యా ఉపకార వేతనాలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. ఐదు లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న హామీని వెంటనే నెరవేర్చాలని, కాంట్రాక్టు, పార్ట్‌టైం అధ్యాపకులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జలాల పరిరక్షణకు ప్రజా ఉద్యమం: కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఇక సహించేది లేదని, తెలంగాణ నీటిని తరలిస్తే యుద్ధమేనని శ్రీకాంత్ గౌడ్ హెచ్చరించారు. పల్నాడు వాటర్ గ్రిడ్ పేరుతో తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అమరజీవి జలధార ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కృష్ణా జలాల తరలింపును అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు.
గతంలో ఫ్లోరోసిస్‌తో తీవ్రంగా బాధపడిన నల్గొండ జిల్లాకు మళ్లీ నీటి కష్టాలు రానివ్వబోమని, నల్గొండ రైతుల నీటి హక్కులను కాపాడేందుకు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో రైతులను సమీకరించి నాగార్జునసాగర్ వద్ద భారీ ప్రజా ఉద్యమం చేపడతామని ప్రకటించారు.
ఉద్యమకారుడిగా అండగా నిలుస్తా: సామాజిక న్యాయం మాటల్లో కాదు, చేతల్లో చూపించాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో సముచిత వాటా కల్పించాలని ఆయన పేర్కొన్నారు. కోట్లు ఉన్న నాయకులకు కాకుండా, ప్రజా సమస్యలపై కొట్లాడే ఉద్యమకారులకు పట్టభద్రులు పట్టం కట్టాలని కోరారు. వారసత్వ రాజకీయాలకు, పారాచూట్ నాయకులకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
కాకతీయ యూనివర్సిటీ నుంచి విద్యార్థి ఉద్యమాల్లో ఎదిగిన సామాన్య బిడ్డగా తనకు నిరుద్యోగుల కష్టాలు తెలుసని, అశోక్‌నగర్ నిరుద్యోగుల నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకు ప్రతి సమస్యపై పోరాడుతానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు సైతం చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేలా కృషి చేస్తానన్నారు. కవిత నాయకత్వంలో ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ప్రజల హక్కుల కోసం పోరాడుతామని, నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని, ఒకవేళ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా రెండో ప్రాధాన్యత ఓటు అయినా వేసి గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి