మహాత్మా గాంధీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి... మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
రామగిరిలో గాంధీజీ విగ్రహానికి నివాళులు...
మూసీ తీరాన ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టు... జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య
నల్గొండ : మహాత్మా గాంధీ ఆశయాలను పూర్తిగా సాధించేందుకు ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న పూజ్య బాపూజీ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ... శాంతియుత మార్గంలో దేశానికి స్వాతంత్ర్యాన్ని సిద్ధంపజేయడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారన్నారు. స్వరాజ్యం సిద్ధించక ముందే కుల వివక్షకు వ్యతిరేకంగా, మతసామరస్య సాధనకు ఆయన అకుంటిత పోరాటం చేశారని కొనియాడారు. "గ్రామ స్వరాజ్యం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం" అని నమ్మిన బాపూజీ ఆదర్శాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతంలో ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టును తలపెట్టిందని, అక్కడ గాంధీజీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ సైతం గాంధీజీ బాటలోనే నడుస్తూ పంచాయతీలకు నేరుగా నిధులు జమచేసే వ్యవస్థను తెచ్చారని గుర్తుచేశారు.
అహింసా మార్గమే ఆయన ఆయుధం.. కలెక్టర్ చంద్రశేఖర్
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ... దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షపై పోరాడి, భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందంజలో నిలిపిన మహానీయుడు గాంధీజీ అని కొనియాడారు. అహింసా మార్గంలో పోరాడితే విజయం తప్పక లభిస్తుందని ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు. నేటి తరానికి ఆయన ఆశయాలే మార్గదర్శకమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో గాంధేయవాదం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... సత్యం, అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన బాపూజీ అడుగుజాడల్లో నడవాలని కోరారు. కార్పొరేటర్ కవిత కూడా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, డిఎస్పీ శివరాం రెడ్డి, స్థానిక తహసిల్దార్ పరశురాంలతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి