సమస్యల పరిష్కారం కోసం డీఎంఈ, టీవీ కమిషనర్ కార్యాలయాలకు సమ్మె నోటీసులు...
నల్గొండ : శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది, సూపర్‌వైజర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌పీఎస్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం డీఎంఈతో పాటు టీవీ కమిషనర్ కార్యాలయంలో సమ్మె నోటీసులు అందజేసినట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. డిసెంబరు 7, 2026న నిర్వహించనున్న సమ్మెలో కార్మికులందరూ యూనియన్లకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఏడాదిగా పరిష్కారం కాని సమస్యలు...
టెండర్ కాలపరిమితి ముగిసి దాదాపు ఏడాది కావస్తున్నా కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ హైదరాబాద్ సమీపంలో ధర్నా నిర్వహించి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ సమస్యలు అలాగే ఉండటంతో రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఇదే సరైన సమయమని, ప్రతి ఒక్కరూ సమ్మెలో పాల్గొని ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్మికులంతా కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నబోస్క నరేష్, రాష్ట్ర నాయకులు నాగమణి, కిరణ్‌కుమార్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ప్రవీణ్, ఎస్‌పీఎస్ నల్లగొండ గౌరవ అధ్యక్షుడు పురం శంకర్, ఎస్.కె. నానిబి తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి