నీటి పొదుపు, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: మున్సిపల్ చైర్‌పర్సన్
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
ఎల్ నినో ప్రభావం, వేసవిలో ఎదురయ్యే నీటి కొరత, పర్యావరణ పరిరక్షణపై చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని పలు వార్డుల్లో శనివారం చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన వార్డు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు ప్రజలకు పలు సూచనలు చేశారు. లక్కారంలోని 8వ వార్డు ఆఫీస్ వద్ద కౌన్సిలర్ బద్రి గాలయ్య అధ్యక్షతన, కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ సారథ్యంలో సమావేశం జరిగింది. గ్రామంలోని మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.తంగడపల్లి గ్రామపంచాయతీ ఆఫీస్ నందు 4, 5, 6, 15వ వార్డుల ఉమ్మడి సభ నిర్వహించారు. కౌన్సిలర్లు ఊదరి యాదయ్య, కొయ్యడ శేఖర్, ఆలే శ్రీలత చిరంజీవి, గడ్డం ఇందిరా రాజరత్నం పాల్గొని ఎల్ నినో వల్ల కలిగే పర్యవసానాలు, నీటి వృథాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. 9, 10, 11, 19వ వార్డులకు సంబంధించి చౌటుప్పల్ కచ్చీరు వద్ద మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ—"పట్టణ పరిశుభ్రతతో పాటు నీటి ఎద్దడిని తట్టుకునేలా వనరులను పొదుపుగా వాడుకోవాలి. ఇంట్లోని గేట్ వాల్వ్‌లు మార్చుకోవడం, లీకేజీ పైపుల స్థానంలో కొత్తవి అమర్చుకోవడం లాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో నీటి వృథాను అరికట్టవచ్చు."కమిషనర్ వెంకటేశ్వర నాయక్ మాట్లాడుతూ.. గాలి, నీరు, భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందనటంతో పాటు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు దేప రమ్య రాజు, పిల్లలమర్రి మధుసూదన్, మెప్మా ఆర్పీలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
12, 13వ వార్డుల పరిధిలోని వినాయకుని మండపం వద్ద కౌన్సిలర్లు పాక చిరంజీవి, బత్తుల వాణి విప్లవ్, కమిషనర్‌తో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమాల్లో మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్వో అంజయ్య, ఇంచార్జ్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ కే. హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ ఎం. రేణు కుమార్, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, జవాన్లు, స్థానిక నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి