- తెలంగాణ పోరాట గడ్డపై పుట్టి.. వేలాది మంది ఐఐటీ ఇంజినీర్లను తీర్చిదిద్దిన విద్యా తపస్వి
- జైలు గోడల మధ్య లెక్కలు నేర్పి ఉద్యమానికి ఊపిరిలూదిన ధీరుడు
- రూపాయి ఖర్చు లేకుండా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచిన ప్రజాప్రతినిధి
- తెలంగాణ విశ్వవిద్యాలయానికి చుక్కా రామయ్య పేరు పెట్టాలంటూ మేధావుల ఆకాంక్ష
హైదరాబాద్ / నల్లగొండ: చదువుల తల్లి ముద్దుబిడ్డ, అక్షర యోధుడు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన విద్యా తపస్వి చుక్కా రామయ్య శతవసంతాల వేళ ఆయన జీవిత ప్రస్థానం నేటి తరాలకు గొప్ప స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. సాయుధ పోరాటాల గడ్డపై పుట్టి, తుపాకీ తూటాలకు ఎదురొడ్డి, ఆ తర్వాత కలం పట్టి సాంకేతిక విప్లవాన్ని సృష్టించిన అరుదైన వ్యక్తిత్వం ఆయనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 'ఐఐటీ రామయ్య'గా ఇంటింటా సుపరిచితులైన ఆయన, ఒకవైపు వేలాది మంది సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దుతూనే, మరోవైపు తనలోని సామాజిక స్పృహను, పోరాట తత్వాన్ని ఏనాడూ కోల్పోలేదు.
పోరాటాల గడ్డపై జననం.. జైలు గోడల మధ్య లెక్కల పాఠాలు: జనగామ ఫిర్కా, పాలకుర్తి మండలం గూడూరు (సోమనాథుడు నడయాడిన నేల) చుక్కా రామయ్య చిరునామా. ఒకవైపు వీరనారి చాకలి ఐలమ్మ పిడికిలి బిగించిన నేల, మరోవైపు తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి అంకురార్పణ జరిగిన కడివెండి, అమరవీరుడు దొడ్డి కొమురయ్య రక్తంతో ఎరుపెక్కిన నేల, పక్కనే సాహిత్యం పండిన బమ్మెర పోతన గడ్డ.. ఇలాంటి చైతన్యవంతమైన వాతావరణంలో చుక్కా రామయ్య జన్మించారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా, భూమి కోసం, భుక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నూనూగు మీసాల యువకుడిగా రామయ్య ఉరికారు.
ఉద్యమంలో భాగంగా అరెస్టయి ఔరంగాబాద్ జైలుకు వెళ్లిన ఆయన, అక్కడ సహచర పోరాట యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం సాహచర్యంలో పోరాట పాఠాలతో పాటు ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించారు. ఆ సమయంలో జైలర్ కుమారుడికి గణితం రాకపోవడంతో, ఖైదీలలో ఉన్న రామయ్యకు లెక్కలు బాగా వచ్చని తెలిసిన జైలు సిబ్బంది ఆయన్ను సంప్రదించారు. నిజాం ప్రభువు నౌకరు బిడ్డకు తాను లెక్కలు చెప్పనని రామయ్య మొదట తిరస్కరించారు. అయితే, రోజువారీగా జైలు బయటకు వెళ్లి వస్తే ఉద్యమ సమాచారాన్ని లోపలికి, బయటకు చేరవేసే అవకాశం ఉంటుందని ధర్మభిక్షం నచ్చజెప్పడంతో రామయ్య అందుకు అంగీకరించారు. జైలులో ఉన్న కమ్యూనిస్టు యోధులు రామయ్య అంకితభావాన్ని చూసి గర్వపడ్డారు.
తరగతి గదే ప్రాణం.. 'ఐఐటీ రామయ్య'గా ప్రస్థానం: తెలంగాణ సాయుధ పోరాట విరమణ అనంతరం చుక్కా రామయ్య ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టారు. భువనగిరిలో గణిత పాఠాలు చెబుతూనే సామాజిక చైతన్యం చచ్చిపోకుండా కాపాడారు. అక్కడ గణిత ఉపాధ్యాయుడు విడిదేవర వెంకట్రావు సాహచర్యంలో ఉపాధ్యాయుల బాధ్యతలు, పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసే పద్ధతులు, తరగతి గది నిర్వహణ మెలకువలను నేర్చుకున్నారు. ఆ అనుభవాలన్నింటినీ 'రామయ్య జ్ఞాపకాలు' పుస్తకంలో అక్షరబద్ధం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తి చేసి అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా, ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా విశేష సేవలందించారు.
ఆ తర్వాత హైదరాబాద్‌లో 'ఐఐటీ కోచింగ్ సెంటర్' స్థాపించి, ఎటువంటి వ్యాపార దృక్పథం లేకుండా వేలాది మంది సామాన్య, మధ్యతరగతి విద్యార్థులను ఐఐటీ ఇంజినీర్లుగా తీర్చిదిద్దారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో తెలుగు విద్యార్థులు సత్తా చాటడానికి ఆయన వేసిన పునాదులే కారణమయ్యాయి. కేవలం ఐఐటీ విద్యార్థులను తయారు చేయడమే కాకుండా, మన రాష్ట్రానికే ఒక ఐఐటీ కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి వెనుకబడిన బాసర ప్రాంతంలో ఐఐటీ ఏర్పాటుకు ప్రకటన చేయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఐఐటీని హైదరాబాద్ సమీపంలోని కందిలో ఏర్పాటు చేయడంతో, బాసరలోనే ఐఐటీ పెట్టాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు, టీడీపీ, వామపక్షాలు, బీజేపీ, ప్రజా సంఘాలతో కలిసి రామయ్య ఉద్యమించారు. ఆ పోరాట ఫలితంగానే బాసరలో ట్రిపుల్ ఐటీ (IIIT) ఏర్పాటైంది.
డబ్బు లేని ఎన్నికల పోరాటం.. తరగతి గదిపై మమకారం: ప్రపంచం దృష్టిలో 'ఐఐటీ రామయ్య'గా ఎదిగినా, ఆయనలోని 'సామాజిక రామయ్య' ఏనాడూ చెక్కుచెదరలేదు. నిజాం పాలన పోయి షేర్వాణీలు వదిలిన పాలకులు ఖద్దరు వేసుకుని ఆధిపత్యపు ఎత్తులు వేస్తున్న తీరును ఆయన నిశితంగా గమనించారు. 1983లో ఏపీ రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న సమయంలో మోటూరి హనుమంతరావు కోరిక మేరకు ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేసి, పీఆర్టీయూ (PRTU) హవా కొనసాగుతున్న నల్గొండ–వరంగల్–ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి యూటీఎఫ్ (UTF) అభ్యర్థిగా ధర్మారెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అయితే, 2007లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే ధర్మారెడ్డిపై చుక్కా రామయ్య మళ్లీ బరిలోకి దిగారు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఉన్నప్పటికీ, రామయ్య ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఏ పాఠశాలకు వెళ్లినా ఉపాధ్యాయులే స్వచ్ఛందంగా ఆహ్వానించి ఆశీర్వదించారు.విశేషమేమిటంటే, ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రామయ్య ఓట్లు అడగడం మర్చిపోయి, నేరుగా తరగతి గదిలోకి వెళ్లి పిల్లలకు లెక్కలు చెబుతూ వారితో ముచ్చటించేవారు. వెంట వెళ్లిన ప్రచారకర్తలు ఆయన్ను బలవంతంగా బయటకు తీసుకువచ్చేవారు. తరగతి గదిపై ఆయనకున్న ఆ అంకితభావమే ఆ ఎన్నికల్లో ధర్మారెడ్డిపై ఘనవిజయం సాధించేలా చేసింది.
విద్యా రంగానికి దిక్సూచి.. విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టాలి: రామయ్య చేతికి మైక్ వస్తే చాలు ఆయన గళం గర్జిస్తుంది. తుని నుంచి తడ దాకా, కోదాడ నుంచి కొడంగల్ దాకా, ఆదిలాబాద్ నుంచి అమలాపురం దాకా వేలాది వేదికలపై విద్యా రంగ మార్పు కోసం ఆయన గళం వినిపించారు. అమెరికా, చైనా, సింగపూర్ దేశాల్లో పర్యటించి అక్కడి విద్యా విధానాలపై 'అమెరికా పాఠం', 'చైనా పాఠం', 'సింగపూర్ అధ్యయనం' వంటి 20కి పైగా విలువైన పుస్తకాలు రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ విద్యాశాఖ మంత్రి ఉన్నా రామయ్య పుస్తకాలను ఇష్టపూర్వకంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించేవారు. 25 ఏళ్ల క్రితమే ఆయన ఆలోచనలతో ఏర్పాటైన 'స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్' ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పేద విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ శిక్షణ అందజేశారు.
తన జీవితాన్ని తరగతి గదికి, విద్యా రంగానికి అంకితం చేసిన శతాధిక వృద్ధుడు చుక్కా రామయ్య గౌరవార్థం ఏదైనా ఒక విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టడం సముచితమని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, విద్యావేత్తలు ఆ దిశగా ఆలోచించాలని మేధావులు ఆకాంక్షిస్తున్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి