పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా ఆర్ముడ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో అక్టోబర్ 27న రక్తదాన శిబిరం, ఓపెన్ హౌస్ కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది, పట్టణ యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ శిబిరంలో మొత్తం 32 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మనం ఇచ్చే రక్తం ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని, రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కానందున రక్తదానానికి ఎంతో ప్రాధాన్యత ఉందని వివరించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని సూచించారు.ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పోలీసు శాఖ విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రతలో షీ టీమ్స్ పాత్ర, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పనితీరు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలను పోలీసు సిబ్బంది విద్యార్థులకు వివరించారు. మహిళలపై వేధింపులు జరిగితే జిల్లా షీ టీమ్ నంబర్ 8712656772కు సమాచారం అందించాలని, మహిళలు షీ-సేఫ్ అప్లికేషన్‌ను వినియోగించుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు పోలీసు శాఖ పనితీరుపై అవగాహన కల్పిస్తున్నట్లు అదనపు ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, వాటి నిర్మూలనలో పోలీసు శాఖకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, డీసీఆర్బీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సైబర్ సెల్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్లు సదా నాగరాజు, నాగేశ్వర్ రావు, నగేష్, రవీందర్, పోలీసు వైద్యాధికారి డాక్టర్ జ్యోతి, ఆర్ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, శ్రీనివాస్ రావు, పోలీసు సిబ్బంది, బ్లడ్ బ్యాంకు ప్రతినిధులు రాజు, విజయ్, పట్టణ యువత తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 32 యూనిట్ల రక్తం సేకరణ
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి