యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్ ఐపీస్ ఈరోజు బీబీనగర్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ముందుగా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సూర్య నాయక్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ పరిచయం చేశారు. అనంతరం ఎస్పీ పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను తనిఖీ చేశారు. పెట్రో కారును పరిశీలించి, అందులో అందుబాటులో ఉన్న పోలీస్ విధులకు సంబంధించిన పరికరాలు, వస్తువులను తనిఖీ చేస్తూ వాటి వినియోగం, నిర్వహణపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లాకప్ గదులు, స్టేషన్ రైటర్ గదిని పరిశీలించి, వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పిటిషన్ కౌంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ఎస్హెచ్ఓ గదిలో వివిధ రికార్డులను పరిశీలించి జనరల్ డైరీ, క్రైమ్ రికార్డులు, సైబర్ క్రైమ్ కేసులు, బాధితులకు నగదు రీఫండ్‌కు సంబంధించిన వివరాలు, ప్రమాద కేసులు, ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు (యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్), పెండింగ్ ట్రయల్ కేసులు, కోర్టు డిస్పోజల్స్, నాన్ బెయిలబుల్ వారెంట్లు, సమన్ల జారీ, అమలుకు సంబంధించిన వివరాలను సమీక్షించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ (VPO)లను ఒక్కొకరిగా పిలిచి గ్రామాల సందర్శన మరియు ప్రజలతో వారి సంభాషణ వంటి విషయాలపై విచారించారు.
అలాగే డయల్ 112 కాల్స్‌కు స్పందిస్తున్న సమయం , డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు, వాటిపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, డయల్ 112కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి రిస్పాన్స్ టైమ్‌ను మరింత తగ్గించాలని, ప్రజలకు పోలీస్ సేవలు వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, మహిళల భద్రత, పోక్సో చట్టం, ఆన్లైన్ గేమింగ్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.
ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మహిళలు మరియు పిల్లల భద్రత, ఆన్లైన్ మోసాల నివారణపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని, విధి నిర్వహణలో క్రమశిక్షణ, జవాబుదారీతనం, పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు.
ఈ వార్షిక తనిఖీలో భువనగిరి డిఎస్పీ బి.రవీందర్,ఎస్హెచ్ఓ సూర్య నాయక్, ఎస్ఐలు తేజం రెడ్డి, కృష్ణయ్య మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి