ఈ నెల 29న నిర్వహించనున్న ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షకు సంగారెడ్డి జిల్లాలో పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 9,960 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ వెల్లడించారు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందుగానే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రవేశం ఉండదని, అభ్యర్థులు ముందుగానే తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని ఎస్పీ సూచించారు. పరీక్ష ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించనున్నారు. పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని, సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని తెలిపారు.అభ్యర్థులు హాల్‌టికెట్‌పై పాస్‌పోర్ట్ సైజు ఫొటో అతికించి సంతకం చేయాలి. పరీక్షకు ఒక రోజు ముందే తమ కేంద్రాన్ని సందర్శించి చిరునామా తెలుసుకోవాలి. హాల్‌టికెట్, నలుపు లేదా నీలం రంగు బాల్‌పాయింట్ పెన్ను మాత్రమే పరీక్ష హాలులోకి తీసుకెళ్లాలి. సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు, కాలిక్యులేటర్లు, పుస్తకాలు, నోట్స్, బ్యాగులు, పర్సులు, నగలు తదితర వస్తువులను అనుమతించరు. పరీక్ష సమయంలో అభ్యర్థుల ఫొటో, వేలిముద్రలు, సంతకాలతో పాటు ఆధార్ ముఖ గుర్తింపు ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 200 ప్రశ్నలు, అన్ని పేజీలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. ఈ పరీక్ష 200 మార్కులకు నిర్వహించనుండగా, తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయని తెలిపారు.సంగారెడ్డి జిల్లాలోని పరీక్షా కేంద్రాల వివరాలు: జేఎన్టీయూ సుల్తాన్పూర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శివంపేట, ఎంఎన్ఆర్ డెంటల్ కళాశాల ఫసల్వాడి, ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఫసల్వాడి, ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఎంఎన్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కళాశాల ఫసల్వాడి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సంగారెడ్డి, కోత్వాల్ హైస్కూల్ కంది, శ్రీ అక్షయ జూనియర్ కళాశాల మల్కాపూర్, ఎస్వీ జూనియర్ కళాశాల రాజంపేట రోడ్, సెయింట్ ఆంథోనీ జూనియర్ కళాశాల శాంతినగర్, సెయింట్ ఆంథోనీ హైస్కూల్ శాంతినగర్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల టీఎన్జీఓ భవన్ పక్కన, సెయింట్ ఆన్స్ హైస్కూల్ రాజీవ్ పార్క్ లేన్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అంబేద్కర్ స్టేడియం సమీపంలో, రిషి హైస్కూల్ బాలాజీనగర్, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పాత బస్టాండ్ సమీపంలో, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పాత బస్టాండ్ సమీపంలో, తారా ప్రభుత్వ కళాశాల ప్రశాంత్‌నగర్, శ్రీ సాహితి టాలెంట్ స్కూల్ సాయికృపానగర్, మాస్టర్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల శాంతినగర్, రాయల్ జూనియర్ కళాశాల శాంతినగర్, పయనీర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చింతల్‌పల్లి, సెయింట్ పీటర్స్ హైస్కూల్ పీఆర్పల్లి, శ్రీ తేజ జూనియర్ కళాశాల కల్వకుంట రోడ్, శ్రీ వాణి హైస్కూల్ మంజీరానగర్, కరుణ హైస్కూల్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్నాయి.అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలని, హాల్‌టికెట్‌పై ఉన్న సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
ఎస్ఐ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి