ఈ అరుదైన పోలికల వల్ల ఆ కవలల కుటుంబానికి విచిత్రమైన సమస్య ఎదురైంది. వారు చిన్నతనంలో, అనగా నాలుగో ఏట ఉన్నప్పుడు తల్లిదండ్రుల పత్రాల ఆధారంగా ఇద్దరికీ విడివిడిగా ఆధార్ నమోదు జరిగింది. అయితే కాలక్రమేణా పదవ తరగతి పరీక్షల సమయానికి బయోమెట్రిక్ అప్‌డేట్ (Biometric Update) చేసుకోవాల్సిన అవరసమొచ్చింది. ఇందులో భాగంగా మొదట ఒక సోదరీమణి తన ఆధార్ బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేసుకుంది. ఆ తర్వాత రెండో సోదరీమణి ఆధార్ అప్‌డేట్‌కు ప్రయత్నించగా.. ఆధార్ సర్వర్ దాన్ని తీవ్రంగా తిరస్కరించింది. ఒకరి బయోమెట్రిక్ వివరాలు ఇప్పటికే నమోదు కావడంతో, రెండో వ్యక్తి మళ్లీ అదే వేలిముద్రలు, కంటి పాపలతో నమోదు చేసుకుంటున్నారని భావించిన సర్వర్ దీన్ని 'డూప్లికేట్' (Duplicate) దరఖాస్తుగా గుర్తించి రిజెక్ట్ చేసింది.
దీంతో ఆ కుటుంబానికి పెద్ద చిక్కు వచ్చిపడింది. ఒకే వ్యక్తి రెండుసార్లు ఆధార్ కోసం ప్రయత్నిస్తున్నారనే అపార్ధం తలెత్తడంతో ఇద్దరూ విడివిడిగా గుర్తింపు పొందలేని విపత్కర పరిస్థితి ఏర్పడింది. విద్యార్థి దశలో ఉన్న ఆ అమ్మాయిల సర్టిఫికెట్లు, భవిష్యత్తుకు ఆధార్ అత్యంత కీలకం కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు - ఆధార్ ప్రధాన కేంద్రం సవాల్:
సమస్య తీవ్రతను గుర్తించిన తల్లిదండ్రులు స్థానిక జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కవలల విచిత్ర పరిస్థితిని అర్థం చేసుకున్న కలెక్టర్, ఈ విషయాన్ని నేరుగా ఆధార్ ప్రధాన కేంద్రానికి (UIDAI Main Center) చేరవేశారు. సాంకేతిక నిపుణులకు ఇదొక సవాల్‌గా మారింది. భారతదేశంలోనే ఇలాంటి సమస్య తలెత్తడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఆధార్ ప్రధాన కేంద్రం ఈ వింత సమస్యను ఒక ప్రతిష్టాత్మక సవాల్‌గా స్వీకరించింది. దేశంలోని ప్రముఖ బయోమెట్రిక్, సాంకేతిక నిపుణులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దాదాపు నాలుగు నెలల పాటు సుదీర్ఘంగా పరిశీలన జరిపించారు. అన్ని కోణాల్లో పరీక్షించిన నిపుణులు చివరకు చేతులెత్తేశారు. సాంకేతికంగా, డిజిటల్ బయోమెట్రిక్ విధానంలో ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. సిస్టమ్ ఆటోమేటిక్ వెరిఫికేషన్ ప్రకారం వారిద్దరినీ ఒకే వ్యక్తిగా గుర్తిస్తుండటంతో సాఫ్ట్‌వేర్ ద్వారా దాన్ని మార్చడం కుదరలేదు.
ప్రత్యేక పద్ధతిలో సమస్యకు పరిష్కారం:
సాంకేతికత విఫలమైనప్పటికీ, ఆ విద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించారు. పాఠశాల రికార్డులలో వారి పుట్టుక నుండి ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్లు, ధ్రువీకరణ పత్రాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. నిపుణుల ప్రత్యేక నివేదికను ఆధారంగా చేసుకుని, టెక్నికల్ లోపాలను అధిగమిస్తూ ఆ ఇద్దరు సోదరీమణులకు వేర్వేరుగా ఆధార్ కార్డులను జారీ చేశారు.
చూసారా.. ఎంత అద్భుతమో! మనిషి మేధస్సుతో తయారు చేసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ప్రకృతి సృష్టించిన కొన్ని విన్యాసాల ముందు తలవంచక తప్పలేదు. వేలిముద్రలు, కనురెప్పలు, ముఖ కవళికలు అన్నీ ఒకేలా సృష్టించబడిన ఈ ఇద్దరు కవలల ఉదంతం మనిషికి అంతుచిక్కని జీవిత రహస్యమేమిటో మరోసారి నిరూపించింది. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా, ప్రకృతిలో ఇప్పటికీ విడదీయరాని కొన్ని అద్భుతాలు దాగి ఉన్నాయని ఈ ఘటన చాటు చెబుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి