లేకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదు
తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జైహింద్ క్రాంతి రాజ్
అంబర్పేట, అక్టోబర్ 14 (స్థానికం):
మెదక్లో చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసానికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) రాష్ట్ర అధ్యక్షుడు జైహింద్ క్రాంతి రాజ్ డిమాండ్ చేశారు. ఐలమ్మ విగ్రహ ధ్వంసం తెలంగాణ ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
అంబర్పేటలో నిరసన ర్యాలీ
మెదక్లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ బుధవారం హైదరాబాద్లోని అంబర్పేటలో తెలంగాణ రజక హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన సభ నిర్వహించారు. తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జైహింద్ క్రాంతి రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన బహుజన వీరవనిత అని పేర్కొన్నారు. ఆమె విగ్రహాన్ని ధ్వంసం చేయడం బహుజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. మహనీయుల చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారిని 24 గంటల్లో గుర్తించి అరెస్టు చేయాలని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధ్వంసమైన విగ్రహం స్థానంలో ప్రభుత్వ ఖర్చులతో కంచు విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా మహనీయుల విగ్రహాలకు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని, ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని సూచించారు.
చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని, ఆమె చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. రజకుల సంక్షేమానికి రూ.50 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతోపాటు గృహాలు, రుణ సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డిమాండ్లు నెరవేర్చకుంటే ఆందోళనలు
ప్రభుత్వం స్పందించకపోతే మెదక్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి, హైదరాబాద్లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి ఇందిరాపార్కు వరకు పాదయాత్ర, ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాలు నిర్వహిస్తామని జైహింద్ క్రాంతి రాజ్ హెచ్చరించారు. ఐలమ్మ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక సంఘం నాయకులు ఓరుగంటి వెంకన్న రజక, శివసాయి రజక, వైనాల లింగన్న రజక, రాకేష్ బాబు రజక, హైదరాబాద్ రజక సంఘం అధ్యక్షుడు రమేష్తోపాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి